– కాళేశ్వరంపై కేంద్రం ఫోకస్ పెట్టిందా?
– అవినీతిని నిగ్గు తేల్చే పనిలో ఉందా?
– హాట్ టాపిక్ గా కాగ్ అధికారుల పర్యటన
– నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ
కాళేశ్వరం.. తెలంగాణ ప్రజల కోసం.. రైతుల అభ్యన్నతి కోసం.. రాష్ట్ర ప్రగతి కోసం.. అంటూ ప్రభుత్వం పదేపదే చెబుతుంటుంది. కానీ.. ప్రాజెక్ట్ పేరుతో దోపిడీ.. వేల కోట్ల అవినీతి.. ఏటీఎంలా వాడేశారు అనేది ప్రతిపక్షాల వెర్షన్. దీనిపై తరచూ అధికార టీఆర్‌ఎస్, విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరుగుతూనే ఉంటుంది. బీజేపీ అయితే.. ఓ అడుగు ముందుకేసి.. కేసీఆర్ ను జైలుకు పంపుతామని ప్రకటించింది. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పిందని అంటున్నారు టీఆర్‌ఎస్ నేతలు. కానీ.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది భారీ స్కాం అంటూ ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు.. ఈ వివాదంపై అనేక సందేహాలూ ఉన్నాయి. ఈ క్రమంలో కాగ్ అధికారులు కాళేశ్వరం సందర్శించడం చర్చనీయాంశంగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం.. ఇప్పటిదాకా చేసిన పనులు.. అందుకు అయిన ఖర్చు.. ప్యాకేజీల వారీగా నిర్మాణాలకు ఎంత వ్యయంతో అనుమతులిచ్చారు? తర్వాత వాటిని ఎంతకు పెంచారు? అనే వివరాలపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) దృష్టి సారించింది. ఢిల్లీకి చెందిన కాగ్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ రాజ్ వీర్ సింగ్, హైదరాబాద్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ రోహిత్ గట్టే కలిసి గురువారం మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు. మోటార్లకు ఎంత ఖర్చు పెట్టారు. ఇతర పరికరాలకు ఎంత అయింది? వంటి వివరాలను సేకరించారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. నిర్మాణ అంచనా వ్యయం? సవరించిన అంచనాలు? బ్యారేజీ లోతు వంటి వివరాలు తెలుసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కాగ్ చేస్తున్న ఆడిట్ ప్రక్రియ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో రాజకీయ పండితులు అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలు జరిగాయనేది ప్రతిపక్షాల ఆరోపణ. దీనిపై నిజానిజాలు తేలాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు కాగ్ నివేదికతో అవన్నీ బయటకు వస్తాయని భావిస్తున్నారు విశ్లేషకులు. నిజానికి ఈ ఆడిట్ ప్రక్రియ గతేడాది జులైలోనే ప్రారంభం అయింది. ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడం టీఆర్‌ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారని చెబుతున్నారు. అటు కాళేశ్వరం విషయాలన్నీ కాగ్ బయటకు తీసుకొస్తోంది. ఇటు చూస్తే రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతోంది. ఇలాగే ఉంటే పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించే కేసీఆర్ కేంద్రంపై యుద్ధం విషయంలో స్పీడ్ పెంచారని అంటున్నారు విశ్లేషకులు.
ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడే ఇంతగా రెచ్చిపోతుంటే.. జాతీయ పార్టీకి చెందిన నేతలం.. దేశాన్ని పాలిస్తున్నామని బీజేపీ నేతలకు ఉండదా? పైగా ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వస్తూ.. అవకాశం ఉన్న తెలంగాణను వదులుకోవాలని ఎలా అనుకుంటుంది. అందుకే కేసీఆర్ ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలని ఫిక్స్ అయిపోయి ఆ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మొన్నామధ్య జరిగిన ఐటీ రెయిడ్స్ కూడా ఇందులో భాగమనే చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన కంపెనీల్లో ఐటీ సోదాలు జరిగాయి. అయితే.. ఈడీ ఎంటర్ అయితేనే అసలు కథ మొదలవుతుంది. ఐటీతో అంటే ట్యాక్స్ కు సంబంధించిన విషయాలే బయటకొస్తాయి. అదే ఈడీ అయితే.. మొత్తం వ్యవహారం వెలుగుచూస్తుంది. కానీ.. ప్రస్తుతానికి కాగ్ తోనే నిజాలన్నీ నిగ్గు తేల్చాలని కేంద్రం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
నిజానికి కాగ్ నివేదిక అనేది రొటీన్ గా మారిపోయింది. ఒకప్పుడు ఏదైనా విషయంపై నివేదిక ఇస్తే ప్రభుత్వానికి పెద్ద డ్యామేజ్ లా ఉండేది. కానీ.. ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టు వేరు. కోట్ల వ్యయంతో నిర్మాణం జరిగింది. దానిపై నివేదిక అంటే పక్కాగా ఉండాలి. అందుకే ప్రత్యక్ష పరిశీలనకు కాగ్ దిగిందని అంటున్నారు విశ్లేషకులు. చైనా నుంచి వచ్చిన పెద్ద పెద్ద మిషన్లు, రివర్స్ పంపింగ్ ద్వారా లాభమా? నష్టమా? పంప్ హౌస్ ల నిర్మాణం సహా ఇతర ఖర్చులపైనా ఆరా తీస్తోందని చెబుతున్నారు.
అయితే.. మోడీకి, కేసీఆర్ కి చెడిపోవడం.. ఐటీ రెయిడ్స్ జరగడం.. కేసీఆర్ ను జైలుకు పంపుతామని బీజేపీ పదేపదే ప్రకటనలు చేయడం.. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరగడం.. తనకు గౌరవం ఇవ్వడం లేదని గవర్నర్ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడం.. ఇలాంటి సమయంలో కాగ్ అధికారులు చేసిన పర్యటన హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం అవినీతిపై కాగ్ ఏం చేయబోతోందనేదే ఇప్పుడు ఇంట్రస్టింగ్. ప్రభుత్వమేమో ఇది గొప్ప ప్రాజెక్ట్ అంటూ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ.. ప్రతిపక్షాలు మాత్రం అవినీతి జరిగిందని అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కాగ్ పర్యటన, ఇవ్వబోయే నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.