కామారెడ్డి జిల్లాలో చిరుత పులి కలకలం రేపింది. ఓ లేగ దూడపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటన లింగం పేట మండల కేంద్ర సమీపంలో జరిగింది. పెద్దవాగు సమీపంలోని గ్రామానికి చెందిన ఆవుల మనోహర్ అనే రైతుకు చెందిన పశువుల కొట్టంలోకి చొరబడిన చిరుత.. పాకలో ఉన్న పశువులపై దాడి చేసింది. ఈ దాడిలో పలు పశువులు గాయపడగా.. ఒక లేగ దూడ మృతి చెందింది.
గ్రామంలోకి చిరుత పులి వచ్చిందన్న సమాచారం తెలియడంతో పశువుల కాపరులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచరిస్తున్న సమీప ప్రాంతాల్లోకి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. అనంతరం స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకొని చిరుత పులి పాద ముద్రలు సేకరించారు అధికారులు.
చిరుత పులి ఎప్పుడు ఎటు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందో తెలీక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బంధించి.. తమను కాపాడాలని అధికారులను కోరుతున్నారు. చిరుత కోసం బోను ఏర్పాటు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.