కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్ లో చైనీస్ ల్యూనార్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కాల్పులు జరిపి 10 మంది మృతికి కారకుడైన దుండగుడు సూసైడ్ చేసుకున్నాడు. శనివారం రాత్రి ఓ డ్యాన్స్ క్లబ్ పై జరిగిన ఈ కాల్పుల ఘటనలో మరో పదిమంది కూడా గాయపడ్డారు. ఆ రాత్రి మళ్ళీ రెండో సారి కూడా కాల్పులు జరిపేందుకు ఈ వ్యక్తి యత్నించాడని, ఆ ప్రాంతాన్నితాము దిగ్బంధం చేయడంతో ఓ వ్యాన్ లో పారిపోబోగా దాన్ని చుట్టుముట్టామని పోలీసులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి వ్యాన్ లోనే తనను తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడని లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ ల్యూనా అనే అధికారి వెల్లడించారు.
ఈ వ్యక్తిని 72 ఏళ్ళ హ్యూ క్యాన్ ట్రాన్ గా గుర్తించారు. ఈ వృద్దుడు ఎందుకీ దారుణానికి పాల్పడ్డాడో తెలియడం లేదని, దర్యాప్తు జరుపుతున్నామని రాబర్ట్ చెప్పారు. ఇతడు సెమి ఆటోమాటిక్ అసాల్ట్ పిస్టల్ తో ఈ అమానుషానికి దిగాడు. ఇతనికి అందిన ఆయుధాలు ఎక్కడివని, మానసిక దౌర్బల్యంతో ఇలా పేట్రేగాడావంటివి తెలియాల్సి ఉందని జుడీ చూ అనే ఎంపీ అన్నారు.
పోలీసులు తన వ్యాన్ చుట్టుముట్టేలోగా హ్యూ క్యాన్ తనపై కాల్పులు జరుపుకున్నాడు. వాహనం స్టీరింగ్ పై ఇతని తల వాలిపోయి ఉందని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం లేదని వారు చెప్పారు.
ఈ ఊచకోతలో మరణించినవారికి సంతాపసూచకంగా అన్ని ప్రభుత్వ భవనాలపై గల దేశ జాతీయ పతాకాలను అవనతం చేయాలని అధ్యక్షుడు జోబైడెన్ ఆదేశించారు. మాంటెరీ పార్క్ లో నాడు జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. శనివారం రాత్రి కొన్ని వేలమంది అక్కడికి చేరుకున్నారు. శని, ఆదివారాలు రెండురోజులపాటు చైనీస్ ల్యూనార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఉత్సాహంగా జరుపుకుందామనుకున్న వారంతా విషాదంలో మునిగిపోయారు.