అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించిన భారత సంతతి మహిళ, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ (51) చైనాపై కీలక వ్యాఖ్యలు చేస్తూ, వార్నింగ్ ఇచ్చారు. సోవియట్ యూనియన్ లాగే కమ్యూనిస్ట్ చైనా కూడా కాల గర్భంలో కలిసిపోతుందని చెప్పారు. వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిక్కీ హేలీ తొలి సారి తన మద్దతుదారులతో కలిసి సౌత్ కరోలినాలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడారు.
తాను భారత మూలాలున్న అమెరికా బిడ్డను అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఆమె అన్నారు. వివక్షకు తావు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తానని దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమెరికా అమలుచేస్తోందని ఆమె కొనియాడారు. ఇండియా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన తనకు యునైటెడ్ నేషన్స్‌లో అమెరికా రాయబారి పదవి దక్కడమే అందుకు నిదర్శనమన్నారు. 2024 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ఆమె పోటీపడుతున్నారు.
అమెరికా చరిత్రలో మైనార్టీ వర్గం నుంచి గవర్నర్‌గా ఎంపికైన తొలి మహిళను తానేనని నిక్కీ పేర్కొన్నారు. ‘‘జో బైడెన్ హయాంలో దేశాన్ని దూషించే వారి సంఖ్య పెరిగింది. దేశంలో విద్వేషం పెరిగింది.. దేశం గాడి తప్పింది అనే దుష్ప్రచారం చేస్తున్నది అలాంటి వాళ్లే. స్వయంగా బైడెన్ కూడా అమెరికా రేసిస్టు దేశమని అంటున్నారు. నేను చెబుతున్నా అమెరికా రేసిస్టు దేశం కానే కాదు” అని నిక్కీ హేలీ కామెంట్ చేశారు.
అమెరికా సైనిక శక్తి మరింత పెరుగుతుంది.. ఎన్నడూలేనంత బలంగా తయారవుతుంది. అయితే, శక్తిమంతమైన మిలటరీ యుద్ధాన్ని ప్రారంభించదు. యుద్ధాలను ఆపుతుంది. ఇజ్రాయెల్ నుంచి ఉక్రెయిన్ వరకు మన మిత్రదేశాలకు మద్దతుగా నిలుస్తాం. అలాగే, ఇరాన్, రష్యాలో మన శత్రువులను సమర్థంగా ఎదుర్కొంటాం.
గతంలో సోవియట్ యూనియన్ లాగే భవిష్యత్తులో కమ్యూనిస్ట్ చైనా కూడా కాల గర్భంలో కలిసిపోతుంది” అని చెప్పారు. చైనా నియంతృత్వ నేతలు ప్రపంచాన్ని “కమ్యూనిస్టు దౌర్జన్యం” పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నారని నిక్కీ హేలీ విమర్శించారు. చైనాను అమెరికా మాత్రమే నిలువరించగలదని అన్నారు.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) ప్రకటించారు. రిపబ్లికన్ నుంచి ఆయనకు పోటీగా నిలిచారు నిక్కీ హేలీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ది బలహీన నాయకత్వం అని ఆమె విమర్శించారు.