ప్రభుత్వాధినేతకు తెలియకుండా… ప్రభుత్వంలో నిర్ణయాలు జరిగిపోతాయా? ప్రజా నాయకుడి ఆమోదం లేకుండా పాలన నడుస్తుందా…? పాలసీ డెసిషన్స్ సీఎంకు తెలియకుండా, మంత్రి మండలి దృష్టికి రాకుండా అధికారులు తీసుకుంటారా…? పాలనపై పట్టులేదని సీఎం జగన్ పరోక్షంగా అంగీకరించారా…?
ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై సీఎం జగన్ యూటర్న్ తీసుకొని చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. పాలనపై పట్టులేదు… మొండిగా ఉంటూ, ఉన్నతాధికారుల మాటను పెడ చెవిన పెడతారని ఇంటా బయట వస్తున్న విమర్శలను సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా అంగీకరించినట్లయింది.
డా.ఏపీజే అబ్దుల్‌కలాం పేరుతో… ప్రతి యేట ప్రతిభా పురస్కారాలను ప్రభుత్వం అందజెస్తుంది. అయితే, కలాం పేరును మార్చి… వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారాలుగా మార్చాలని ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసింది. దాంతో కలాంను కాదని.. వైఎస్ పేరా అంటూ విమర్శలు వచ్చాయి. మేధావులు సైతం భారతరత్న కలాంను అవమానించటమే అంటూ ఫైర్ అయ్యారు. దాంతో సీఎం జగన్ ఆ జీవోను రద్దు చేయాలని ఆదేశించటంతో పాటు, తనకు తెలియకుండానే ఆ జీవో వచ్చిందని ప్రకటించారు.
అయితే, జీవోలు… అందులోనూ కీలక నిర్ణయాలు తీసుకునే జీవోలు సీఎంకు తెలియకుండా, సీఎం కార్యాలయానికి తెలియకుండా ఎలా వస్తాయన్న ప్రశ్న మొదలైంది. ప్రభుత్వంలో షాడోగా ఇంకా ఎవరైనా పనిచేస్తూ… వైసీపీకి, వైఎస్‌కు అనుకూలంగా ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నారా అన్న చర్చ జోరందుకుంది. అదే నిజమైనా… ఏకంగా జీవోలను కూడా విడుదల చేయటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ తానై వ్యవహరించే సీఎం జగన్‌కు తెలియకుండా నిర్ణయం ఎలా జరుగుతుంది, జగన్‌ను కాదని మరి ఎవరు నిర్ణయం తీసుకున్నారు అని ప్రశ్నిస్తున్నారు.