ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తనను కస్టడీలో ఉంచడం ద్వారా దర్యాప్తు సంస్థలను తన స్ఫూర్తిని దెబ్బ తీయలేవని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. జైల్లో పెట్టడం ద్వారా తనను ఇబ్బందులకు గురి చేస్తే చేయొచ్చన్నారు.
కానీ తన స్ఫూర్తిని మాత్రం దెబ్బ తీయలేరని ఆయన అన్నారు. గతంలో బ్రిటీష్ వాళ్లు కూడా స్వాతంత్ర్య సమరయోధులను ఇలానే అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారన్నారు. కానీ వారి స్ఫూర్తిని మాత్రం బ్రిటీష్ వారు దెబ్బతీయలేకపోయారన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సిసోడియాను సీబీఐ అధికారులు గత నెల 26న అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని కోర్టులో హాజరు పరచగా ఆయన్ని సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తీహార్ జైల్లో ఉండగానే ఆయన్ని అరెస్టు చేస్తున్నట్టు మరో దర్యాప్తు సంస్థ ఈడీ ప్రకటించింది.
ఆయన్ని నిన్న న్యాయస్థానంలో ఈడీ హాజరు పరిచింది. ఈ సందర్బంగా సిసోడియా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… సిసోడియా అరెస్టు సమయంలో సరైన న్యాయ ప్రక్రియను ఈడీ అనుసరించలేదన్నారు. ఈ రోజుల్లో అరెస్టులను ఏజెన్సీలు హక్కుగా తీసుకోవడం ఒక ఫ్యాషన్‌గా మారిందన్నారు.