బీజేపీ అంటే హిందూ మతం… హిందూ మతం అంటే బీజేపీ అన్న స్థాయి వాతావరణం అందరికీ తెలిసిందే. అయితే… ఆ మధ్య బీజేపీ ఏమైనా హిందువులకు బ్రాండ్ అంబాసిడరా…? నా కన్నా పెద్ద హిందువు ఎవడున్నారు….? నేను చేసినన్ని యాగాలు, హోమాలు మోడీ చేశాడా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. కానీ నిలకడ లేని కేసీఆర్ ఆరోపణలు అక్కడితోనే ఆగిపోయాయి.
అయోధ్యలో రామమందిర నిర్మాణం బీజేపీ తన ఖాతాలో వేసుకుంటుంది. అందుకు ముఖ్య ఉదాహరణ ప్రధాని మోడీ గడ్డం తీయకపోవటమే. అవును… వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి అయోధ్య రామ మందిర నిర్మాణమే ఎన్నికల ఎజెండా కావాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. అందుకే నిర్మాణం కోసం ప్రతి ఊరి నుండి విరాళాలు సేకరించేలా చూశారు. బీజేపీ శ్రేణులు యాక్టివ్ గా పాల్గొన్నాయి. విరాళాల సేకరణలో తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. మీ రాముడేనా… మా రాముడు లేడా అంటూ కొందరు ఎమ్మెల్యేలు ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు.
కానీ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్రంలో ఏమాత్రం బలోపేతం అయినా… రామ మందిర సెంటిమెంట్ తో దిగిపోతారన్న అనుమానం టీఆరెఎస్ లో ఉన్నట్లు కనపడుతుంది. అందుకే ఇందుకు విరుగుడు మంత్రంగా టీఆర్ఎస్ కొండగట్టు అంజన్నను ఎత్తుకునేలా ఉందన్న వాతావరణం కనపడుతుంది. ఎమ్మెల్సీ కవిత వరుసగా కొండగట్టును దర్శించుకోవటం, ఆంజనేయస్వామి సన్నిధిలో రామకోటి స్థూపం నిర్మాణానికి పునాది వేయటం, రాష్ట్రం అంతా రామకోటి కార్యక్రమం జరిగేలా చూడాలని నిర్ణయించటం చూస్తుంటే ఇదేనన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు. ఈ 6 సంవత్సరాలుగా కొండగట్టును పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు… ఇప్పుడు హాడావిడి చేయటం వెనుక ఈ కారణమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది.