సినిమాల ప్రభావం సమాజం మీద చాలా ఉంది అనడంలో సందేహం లేదు. ఆ ప్రభావం వల్ల మంచి జరిగితే పర్వాలేదు. అయితే చెడే ఎక్కువ జరుగుతుంది..?! దురదృష్ట వశాత్తు అవే సినిమాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. దీనికి అల్టిమేట్ ఉదాహరణం పుష్ప. గంధపు చెక్కల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఇది.
పుష్ప సినిమా విడుదలైన తర్వాత పోలీసులకు కొత్త తలనొప్పి మొదలైందట. ఎందుకంటే చాలా మంది స్మగ్లర్లు ఈ మూవీ స్టైల్‌ని ఉపయోగించుకుని స్మగ్లింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. నేరస్తులను పట్టుకోలేక పోలీసుల తల ప్రాణం తోకకొస్తోంది.
అయితే రాచకొండ పోలీసులు మాత్రం కాస్త స్మార్ట్‌గా ఆలోచించారు. పుష్ప సినిమాను రెండు మూడు సార్లు చూసినట్టున్నారు. అందుకే స్మగ్లర్లు ఆలోచించే విధానాన్ని బాగా అవపోసన పట్టారు పోలీసులు. వారి ఎత్తులకు పైఎత్తులు వేసి మొత్తానికి పట్టేసుకున్నారు.
తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో పుష్ప సినిమా స్టైల్లో స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. 400 కిలోల గంజాయిని ఓ డీసీఎం వాహనం లోపల స్పెషల్ కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసి తరలించేందుకు ప్రయత్నించారు.
కానీ వారి ప్లాన్‌ను పసిగట్టిన పోలీసులు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగంపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక నిఘా పెట్టామని సీపీ చౌహాన్ తెలిపారు.
పక్కా సమాచారంతో అంతర్రాష్ట్ర గంజాయి ముఠాకు చెందిన నలుగురిని చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి 400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు రూ.కోటిన్నర ఉంటుందని చెప్పారు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో గంజాయి తీసుకొని మహారాష్ట్ర, కర్ణాటకకు తరలిస్తున్నారని వివరించారు. మరోవైపు 10 గ్రాముల హెరాయిన్‌ను ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను మీర్‌పేట్ పోలీసులకు అప్పగించారు.
ఈ ముఠా పుష్ప సినిమా చూసి బాగా ఇన్‌స్పైర్ అయినట్టుంది. డీసీఎం వాహనం లోపల ఎవరికీ తెలియకుండా గంజాయి తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మా పోలీసులు కూడా పుష్ప సినిమా చూశారు. అందుకే వీరి ఆట కట్టించగలిగారు. అనుమానం వచ్చి డీసీఎం వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయగా.. స్పెషల్ కంపార్ట్‌మెంట్ ఒకటి ఏర్పాటు చేసినట్టు గమనించారు.
దాన్ని తెరిచి చూస్తే వీళ్ల బండారం బయటపడింది. ఇప్పటి వరకు వీళ్లు 6 ట్రిప్పుల గంజాయిని తరలించినట్లు తేలింది. స్థానికంగా కూడా కొంచెెం సరఫరా చేశారు. మిగతాది మహారాష్ట్రలో సరఫరా జరిగినట్లు సమాచారం.
ఈ కేసులో మొత్తం ఏడుగురి పాత్ర ఉందని తేలింది. ప్రస్తుతం నలుగురిని అరెస్ట్ చేశాం. గంజాయి సరఫరాలో ప్రధాన పాత్రధారుడు కింగ్‌పిన్ వీరన్నగా గుర్తించాం. మొత్తం నెట్‌వర్క్‌ను నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నామని రాచకొండ సీపీ తెలిపారు.
.