బీజేపీ ఎంపీ, తనకు వరుసకు సోదరుడయ్యే వరుణ్ గాంధీ సిధ్ధాంతాలు తమకు ఆమోదయోగ్యం కావని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో కూడిన వరుణ్ గాంధీని కూడా మీ భారత్ జోడో యాత్రకోసం ఆహ్వానిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా ఈ వ్యాఖ్య చేశారు. అలాగే వరుణ్ ని మీ పార్టీలో చేర్చుకుంటారా అన్న ప్రశ్నకు కూడా రాహుల్ ఇలాగే స్పందించారు.
‘మా ఇద్దరి సిధ్ధాంతాలు కలవబోవు.. ఆయన ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ కి దగ్గరగా ఉంటుంది. అసలు ఆ సంస్థ కార్యాలయానికి నేను వెళ్లే ప్రసక్తే లేదు.. ఒకవేళ వెళ్లాల్సి వస్తే దానికి ముందే నా తల నరుక్కుంటాను’ అని కాస్త ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. వరుణ్ కి తన సొంత ఐడియాలజీ ఉండవచ్చునని, కానీ దాన్ని తను అంగీకరించనని అన్నారు. ‘నేను వరుణ్ ని తప్పకుండా కలుస్తాను.. హగ్ చేసుకుంటాను.. కానీ ఆయన వైఖరిని ఆమోదించడమన్నది అసాధ్యం’ అని రాహుల్ పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య సిధ్ధాంతపరంగా ఎన్నో వైరుధ్యాలున్నాయని, ఈ ‘పోరు’ కొనసాగుతోందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి చేస్తున్న మంచిని గురించి లోగడ ఓ సందర్భంలో వరుణ్ గాంధీ తన వద్ద ప్రస్తావించారని, కానీ మన కుటుంబ చరిత్రను చదివి అర్థం చేసుకోవాలని తాను చెప్పానని ఆయన తెలిపారు. మన కుటుంబ ఐడియాలజీ గురించి తెలిస్తే నువ్విలా మాట్లాడవని అన్నానని రాహుల్ వెల్లడించారు. కానీ ఆయన పట్ల తనకు ద్వేషం లేదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని అన్ని వ్యవస్థలను తమ హస్తగతం చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. మీడియా, ఈసీ, జుడీషియరీ ..ఇలా అన్ని వ్యవస్థలను అవి కబళిస్తున్నాయన్నారు.
మంగళవారం పంజాబ్ లోని హోషియార్ పూర్ లో తన భారత్ జోడో పాద యాత్ర సందర్భంగా ఓ వ్యక్తి తనను హగ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం గురించి ప్రస్తావిస్తూ ఆయన.. ఇందులో భద్రతా వైఫల్యమేమీ లేదన్నారు. సెక్యూరిటీ తనిఖీ అనంతరం ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడని, కానీ తనను చూసి ఉద్వేగంతో ముందుకు రాబోయాడని చెప్పారు. పార్టీ నేతలు అతడిని నివారించారన్నారు.