వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ ఎంతగానో ప్రయత్నిస్తోంది. మోడీ సర్కార్ కు వ్యతిరేకమైన ప్రతీ అంశాన్ని హైలైట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం సాగు చట్టాల రద్దు అంశాన్ని ముందుంచి.. కేంద్రం తప్పును ఎత్తిచూపుతూ ముందుకు వెళ్తోంది రెండు పర్యాయాలు అధికారానికి దూరమైనా ఈసారి మాత్రం అధికార పక్షంగానే ఉండాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది.
2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధించగా.. కాంగ్రెస్ కు 52 దక్కాయి.. వచ్చే ఎన్నికల్లో ఈ లెక్కను రివర్స్ చేయాలని చూస్తోంది హస్తం పార్టీ. 300 ఎంపీ సీట్లే టార్గెట్ గా అడుగులు వేస్తోంది. అయితే ఇలాంటి సమయంలో ఆపార్టీ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల్లో 300కు పైగా సీట్లను కాంగ్రెస్ సాధించే అవకాశాలపై సందేహం వ్యక్తం చేశారు.
కాశ్మీర్ లోని పూంఛ్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన ఆజాద్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 300 సీట్లు గెలుస్తుందని తాను హామీ ఇవ్వలేనన్నారు. కానీ.. 300 స్థానాలు గెలవాలని మాత్రం కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే అది జరిగేలా కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఆజాద్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. దేశమంతా పెద్ద చర్చకు దారితీశాయి.