కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బహుజన సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. బీఎస్పీతో పొత్తు ప్రస్తావనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఆదివారం ఖండించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
మిస్టర్ రాహుల్ గాంధీజీ మీరు మీ ఇంటిని చక్కదిద్దుకోలేరు గానీ మా బీఎస్పీ పార్టీపై విమర్శలు చేస్తున్నారా అంటూ విమర్శించారు. పొత్తుపై రాహుల్ గాంధీ చెప్పిన విషయాలు అసత్యమన్నారు. ఇప్పుడు ఈ చిన్న విషయాల కన్నా ముందు ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై ఆలోచించండి అంటూ చురకలు అంటించారు.
‘ అలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాంగ్రెస్ వంద సార్లు ఆలోచించుకోవాలి. బీజేపీపై గెలవలేకపోయారు కానీ ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తు్న్నారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ చేసిందేమీ లేదు’ అని అన్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఏర్పాటుకు ముందుకు రావాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని తాము ఆహ్వానించామని, ఆమెకు సీఎం పదవిని కూడా ఆపర్ చేశామని రాహుల్ గాంధీ శనివారం అన్నారు. కానీ సీబీఐ,ఈడీ కేసులకు బయపడి ఆమె బీజేపీ విజయానికి మార్గం చేసిందని రాహుల్ గాంధీ తీవ్రవ్యాఖ్యలు చేశారు.