జామియా యూనివర్సిటీ ఘటన బాలీవుడ్ ను రెండు వర్గాలుగా విడదీస్తున్నాయా ? అంటే అవుననే అనిపిస్తోంది. విద్యార్ధులపై పోలీసుల అణిచివేతను చూసి మౌనంగా ఉండేవారు కొందరైతే మేము మౌనంగా ఉండలేమంటూ మాట్లాడుతున్న వారు మరికొందరు. మౌనం వీడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నటులు ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, పరిణీతి చోప్రా, తాప్సీ పన్ను, మనోజ్ బాజ్ పేయ్, కొంకణసేన్ శర్మ, నిర్మాతలు అనురాగ్ కశ్యప్, మహేష్ భట్, సుధీర్ మిశ్రా లు విద్యార్ధులపై అణిచివేతపై ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండించారు.
” విద్యార్ధులపై పోలీసుల లాఠీచార్జ్ తీవ్రంగా కలచివేసింది..నిరసనలు కూడా ప్రజా ఆస్తుల ధ్వంసానికి దారి తీసి హింసాత్మకంగా మారొద్దు” అంటూ ఆయుష్మాన్ ఖురానా ట్విట్ చేశారు.
ఘటనపై నటుడు రాజ్ కుమార్ స్పందిస్తూ ” విద్యార్ధులతో పోలీసుల హింసాత్మక దోరణిని ఖండిస్తున్నాను…ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే ఏ చర్యనైనా ఖండిస్తున్నాను” అన్నారు
” ఇది చాలా దూరం వెళ్లింది..ఇక ఏ మాత్రం మౌనంగా ఉండలేను..ఈ ప్రభుత్వం మతోన్మాద ప్రభుత్వమని స్పష్టంగా అర్ధమవుతుంది.. ఈ ఘటనపై మౌనంగా ఉండే వాళ్లను చూస్తే కోపం వస్తుంది” అంటూ అనురాగ్ కశ్యప్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
”నిరసన తెలిపే విద్యార్ధుల తరపున నిలబడతాను…ఎలాంటి హింసను సహించను”అంటూ రితీష్ దేశ్ ముఖ్ విద్యార్ధులకు సంఘీభావం తెలిపారు. యాక్టర్ రిచా చద్దా కూడా విద్యార్ధులకు సంఘీభావం తెలిపారు.
‘లిప్ స్టిక్ అండర్ మై బుర్కా’ నిర్మాత అలంకృత శ్రీవాస్తవ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో తాను చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ”విద్యార్ధుల కోసం నా హృదయం రక్తమోడింది” అన్నారు.
జామియా యూనివర్సిటీ, అలీఘర్ యూనివర్సిటీ విద్యార్ధులపై అణిచివేతను ఖండిస్తూ ప్రతి ఒక్కరు ప్రధాన మంత్రి మోదీకి ఖండనలు పంపాలని సెలబ్రిటీస్ కోరారు.