పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పోలవరం నిర్మాణ బాధ్యతలు ఏపీ ప్రభుత్వమే చేపడుతున్నందున.. నిర్వాసిత కుటుంబాలకు కేంద్రమే నేరుగా నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చేసిన రిక్వెస్ట్ ను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి అనుగుణంగా లేదని తెలిపింది. లోక్ సభలో వైసీపీ ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం చేసిన ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని షెకావత్ పేర్కొన్నారు. భూసేకరణ,పునరావాసం పై రాష్ట్రం చేసిన ఖర్చుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగడం లేదని ఆయన తెలిపారు.
భూసేకరణ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు 3,779.05 కోట్ల బిల్లులను ఏపీ ప్రభుత్వం సమర్పించిందని తెలిపారు. వాటిలో 3,431.59 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఏపీ ప్రభుత్వం 2,267,29 కోట్ల బిల్లులు సమర్పించగా.. ఇప్పటి వరకు 2,110.23 కోట్లు తిరిగి చెల్లించాం అని షెకావత్ పేర్కొన్నారు.