– 2024 వరకు ఏపీకి హైదరాబాదే రాజధాని!
– బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
– అక్కడి నుంచే పాలించమని టీడీపీ సెటైర్లు
– ఏపీలో “హైదరాబాద్” పాలిటిక్స్
విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ రాజధాని. కానీ.. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పాలన అంతా అమరావతికి షిఫ్ట్ చేశారు. మనకూ ఓ రాజధాని ఉండాలని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఓటుకు నోటు కేసుకు భయపడి ఆయన అక్కడకు వెళ్లారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఉన్నాయనుకోండి. ఆ విషయం అటుంచితే.. ఒక్కో శాఖ హైదరాబాద్ నుంచి అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఐదేళ్లు గడిచింది.. ప్రభుత్వం మారింది. 2019లో వైసీపీ సర్కార్ వచ్చింది.
రాను రాను హైదరాబాద్ కూడా మనకు రాజధానే అనే విషయాన్ని అందరూ మర్చిపోయారు. కానీ.. ఇప్పుడు సడెన్ గా ఆ విషయాన్ని గుర్తు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని అంశంలో హైకోర్టు తీర్పు తర్వాత టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వెంటనే అమరావతి పనులు చేపట్టమని టీడీపీ డిమాండ్ చేస్తుంటే.. తమది వికేంద్రీకరణ పాలసీ అని వైసీపీ గట్టిగా చెబుతోంది. ఈ క్రమంలోనే 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదేనని అన్నారు బొత్స. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టు మాట్లాడి ఉంటుందని చెప్పారు. ఎందుకంటే.. రాజధానిని తాము గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్ కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుందని అన్నారు. అయితే.. అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవు.. తమ ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమేనని వ్యాఖ్యానించారు.
బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పటికే అమరావతే రాజధాని అని అక్కడ్నుంచే అన్ని కార్యక్రమాలు సాగించాలని హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం ముందుకెళ్తుందా? లేదా? అనే ఉత్కంఠ అందరిలో ఉంది. అయితే.. తాము వికేంద్రీకరణ వైపే ఉన్నామని బొత్స ప్రకటన చేశారు.
బొత్స కామెంట్స్ తో రాజధాని అంశంపై వైసీపీ మరింత గందరగోళంలో ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. హైకోర్టు తీర్పును అంగీకరించలేక.. చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలో తెలియక… అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని టీడీపీ విమర్శలు చేస్తోంది. ఏపీ రాజధాని హైదరాబాద్ అయితే.. అక్కడి నుంచే పాలన చేయండని సెటైర్లు వేస్తోంది. విభజన తరువాత ఏపీ నుంచే పాలన సాగించాలని అమరావతికి వచ్చామని చెబుతోంది. అమరావతి విషయంలో పరువు పోవడంతో.. హైదరాబాద్ పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడుతోంది.