పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీ పార్టీలో చేరారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన బీజేపీలో విలీనం చేశారు. అమరీందర్ కు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.
అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు చాలా రోజులుగా ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ అమరీందర్ సింగ్ కొన్ని రోజుల క్రితం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, కిరణ్ రిజిజు సహా పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వినీ శర్మ, తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ నేత, పంజాబ్ మాజీ ఉపసభాపతి అజైబ్ సింగ్ భట్టి కమలం పార్టీలో చేరారు.
కాగా 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన అమరీందర్.. గతేడాది హస్తం పార్టీతో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చేశారు. అప్పటి పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ తో విభేధాలు రావడంతో ఆయనను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమరీందర్.. హస్తం పార్టీకి రాజీనామా చేశారు.
అనంతరం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయగా.. ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. పాటియాలా నుంచి పోటీ చేసిన అమరీందర్ సింగ్ కూడా ఓటమి చెందడం గమనార్హం.