మున్సిపల్ ఎన్నికలకు ముందే ముందుండి నడిపించాల్సిన నేత చేతులెత్తేశారు. మొక్కుబడి సమీక్షలు తప్పా, గ్రౌండ్‌లోకి వెళ్లి పార్టీని బతికించుకునేందుకు ఎలాంటి తాపత్రయం కనపడటం లేదు. దీంతో మున్సిపల్ ఎన్నికల బాధ్యత స్థానిక నేతలపైనే పడింది.
మిని ఎన్నికల సంగ్రామం వంటి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయంటే హడావిడి వేరుగా ఉంటుంది. పైగా రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఎన్నికల హమీలపై దృష్టిగా పెట్టలేదు. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీ నేతగా పీసీసీ చీఫ్ జనంలో విస్తృత పర్యటనలు చేయాలి, స్థానిక నేతలకు అండగా ఉంటూ దైర్యం కల్పించాలి. అధికార పార్టీని ఎదుర్కొని పార్టీని విజయ తీరాలకు చేర్చేందుకు ప్రతి మున్సిపాలిటి వారిగా రాష్ట్ర స్థాయి నేతలను, ప్రభావం చూపగలిగే నాయకత్వానికి బాధ్యత అప్పగించాలి. కానీ మొక్కుబడి సమీక్షలతో కేవలం ఆఫీసుకే పరిమితమయ్యారు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
మున్సిపల్ ఎన్నికలున్నాయని తెలిసీ, నేను పీసీసీ చీఫ్ పదవి వద్దని చెప్పేశా… అంటూ కామెంట్స్ చేశారు. యుద్దానికి ముందే అస్త్ర సన్యాసం చేసినట్లుగా ఎన్నికలకు ముందుగానే తనది బాధ్యత కాదని తప్పుకున్నారన్న విమర్శలు ఉత్తమ్‌పై వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు మున్సిపల్ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నారు తప్పా పార్టీ నుండి ఎలాంటి సహకారం వచ్చేలా కనపడటం లేదు.
కాంగ్రెస్ తమకు పోటీయే అంటూ స్వయంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారంటే పార్టీ ఇంకా పటిష్టంగానే ఉందని అర్థం. కానీ అలాంటి క్యాడర్‌ను సన్నద్దం చేయాల్సిన నాయకత్వం మాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాంతో ఎవరి నియోజకవర్గంలో వారు తమకు కావాల్సిన నేతల వరకు మాత్రమే గెలిపించుకునేలా వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నారు. అంతే కానీ ఇంతవరకు అన్నీ మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల సన్నాహక సభలు… వ్యూహాలు వంటి మీటింగ్‌లు ఏవీ జరగకపోవటం గమనార్హం.