ఇంకొన్ని గంటల్లో పెళ్లి.. బంధువులతో వరుడి తరఫు కుటుంబం ఎంతో సంతోషంగా మంటపానికి వెళ్తోంది. కానీ.. మృత్యువు అందర్నీ కబలించింది. ఇరు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. చౌత్ లోని బర్వాడ నుండి కారులో ఉజ్జయినికి వెళ్తోంది పెళ్లి బృందం. అయితే.. కోట సమీపంలోని కల్వర్టు దగ్గర వాహనం అదుపుతప్పి చంబల్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో వరుడు సహా 9 మంది చనిపోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీమ్ తో వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో నదిలో పడిపోయిన కారును బయటకుతీశారు.
వాహనంలో 7 మృతదేహాలు, నీటిలో 2 మృతదేహాలను గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో బాధగా ఉందని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.