ఆలయ రథోత్సవంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో 11 మంది భక్తులు సజీవదహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
తంజావూరు కలిమేడు అప్పర్ ఆలయ రథం విద్యుత్ తీగకు తగలడంతో ఈ ఘోరం జరిగింది. అప్పర్ గురుపూజై(అయ్యప్పస్వామి పండుగ) సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహించారు భక్తులు. రథాన్ని వీధులగుండా గుడికి తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తు అది హైటెన్షన్ వైర్లకు తగిలింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో రథం పూర్తిగా కాలి బూడిదైంది.
కలిమేడు గ్రామంలోని అప్పర్ దేవాలయంలో ఏటా చిత్రై మాసంలో సతయ ఉత్సవాలు జరుపుతారు. ఇందులో భాగంగా 94వ సతయ ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున రథాన్ని కలిమేడు గ్రామంలోని వీధుల్లో ఊరేగించారు. తిరిగి ఆలయానికి తీసుకొస్తున్న క్రమంలో దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉన్న హై వోల్టేజ్ విద్యుత్ తీగకు తగిలింది.
రథాన్ని లాగుతున్న వ్యక్తులు, చుట్టుపక్కల ఉన్నవారు విద్యుదాఘాతానికి గురయ్యారు. తర్వాత మంటలు చెలరేగి రథం కాలిపోయింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే చనిపోగా.. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
Advertisements
అగ్నిప్రమాద ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇటు ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు.