రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి ఏకంగా 20 వాహనాలపైకి దూసుకెళ్లింది. మల్కాపూర్ నుండి చేవెళ్లకు వస్తుండగా కారు అదుపుతప్పి ఒక్కసారిగా బైకులపైకి దూసుకెళ్లింది. కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించడంతో భయాందోళనకు గురైన వాహనదారులు.. తమ వాహనాలను అక్కడే వదిలి పరుగులు పెట్టారు.
చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి కారులో వెళ్తున్నాడు. కారు జర్నలిస్టు కాలనీకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన ఆపి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు, బైకులు మొత్తం కలిసి 20 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారు సృష్టించిన బీభత్సంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాద సమయంలో రోడ్డుపై జనాలెవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
అయితే కారు నడుపుతున్న సమయంలో డ్రైవింగ్ చేస్తున్న రాజశేఖర్ కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఫిట్స్ రావటంతో.. యాక్సలరేటర్ తొక్కిపట్టటంతో కారు అతివేగంతో దూసుకెళ్లినట్టు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో వాహనాల దగ్గర ఉన్న జనాలు దూసుకొస్తున్న కారును గమనించి పరుగులు తీశారు. ప్రమాదం జరిగింది మధ్యాహ్న సమయంలో కాబట్టి.. రోడ్డు మీద పెద్దగా జనాలు లేకపోవటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అప్పటికీ ప్రమాదానికి కారణమైన కారు, మిగతా వాహనాలన్ని తుక్కుతుక్కయ్యాయి.