చైనాలో మరోసారి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన నెల రోజులుగా ప్రధాన నగరాల్లో కరోనా డేంజర్ బెల్స్ ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌లో వారం రోజులుగా బయటపడని రీతిలో.. వైరస్ వ్యాప్తి స్టార్ట్ అయిందని వ్యాధుల నియంత్రణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ పాంగ్ జిన్ ఘువో తెలిపారు. ఈ క్రమంలో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. అంతేకాదు, సామూహిక పరీక్షలకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా 35 లక్షలకుపైగా జనాభా ఉన్న చావోయాంగ్‌లో భారీగా కేసులు బయటపడుతున్నాయి. దీంతో ఆ జిల్లా మొత్తం కొవిడ్ పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ మొత్తం 35 లక్షల కరోనా పరీక్షలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
ఇందులో భాగంగా తొలి రౌండ్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. దీంతో కరోనా టెస్టుల కోసం ప్రజలంతా ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద బారులు తీరారు. రెండో రౌండ్ పరీక్షలు బుధవారం, మూడో రౌండ్ పరీక్షలు శుక్రవారం నిర్వహిస్తారు.
చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. బీజింగ్‌లో 29 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 70కి చేరాయి. చొయాంగ్ జిల్లాలో గతకొన్ని రోజులుగా వెలుగుచూసిన కేసుల సంఖ్య 49కి చేరింది. చైనా అగ్రనాయకులు ఎక్కువ మంది ఈ జిల్లాలోనే నివసిస్తున్నారు.
మరోవైపు, బీజింగ్‌లో ఆంక్షలు కఠినతరం చేస్తోన్న నేపథ్యంలో బీజింగ్ మొత్తం లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు ముందుజాగ్రత్తగా నిత్యావసరాలను విపరీతంగా కొనేస్తున్నారు. దీంతో తీవ్ర ఆహార కొరత తలెత్తింది.