కరోనా ప్రమాద ఘంటికలు మరోసారి మోగిస్తోంది. దేశంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. అంతేకాదు, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో.. ప్రజల్లో కరోనా ఫోర్త్‌వేవ్ భయం వెంటాడుతోంది.
కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే పెరిగింది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2451 మంది కరోనా బారినపడ్డారని,54 మంది ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా, 1,589 మంది కోలుకున్నారు. ఇక, తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,52,425కు చేరాయి. కోలుకున్న వారి సంఖ్య 4,25,16,068కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,22,116కి చేరింది.
అయితే, ప్రస్తుతం మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 98.75 శాతం మంది కోలుకోగా, 1.21 శాతం మంది మృతిచెందారని తెలిపింది. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.5 శాతానికి పైగా ఉంది.
ఇక కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ దేశవ్యాప్తంగా వేగంగా సాగుతోంది. గురువారం 18,03,558 మందికి కరోనా టీకా అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,26,26,515కు చేరింది. మరో 4,48,939 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి . ఒక్కరోజు వ్యవధిలో 8,10,560 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 3,289 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.