సులభ మార్గల్లో రుణాలు కల్పిస్తామని నమ్మించి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న బోగస్ కంపెనీల లెక్కలు తేల్చేందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రెడీ అయ్యారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అధికారులు అందించిన సమాచారంతో కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. రుణ యాప్, పెట్టుబడుల పేరుతో 13 డొల్ల కంపెనీలు మోసాలు చేస్తున్నట్టు తేలింది.
నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో ఈ కంపెనీలు ఏర్పడ్డాయని గుర్తించిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అధికారులు సీసీఎస్ పోలీసులకు వివరించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు కీలక విషయాలు తెలుసుకున్నారు. సులభ మార్గాలలో అప్పులు ఇస్తామని చెప్పి.. అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని తెలిపారు.
మరోపక్క పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని కొంత మందిని ఆకర్షించారని తేల్చారు. దాదాపు 2,200 కోట్ల రూపాయలను హవాలా మార్గంలో హాంకాంగ్, అక్కడి నుంచి చైనా తరలించినట్లు కనుక్కొన్నారు. మాల్ 008, మాల్ 98, వైఎస్0123, మాల్ రిబేట్.కామ్ పేరుతో అప్లికేషన్లు రూపొందించి మెసేజ్, వాట్సాప్ సందేశాలు, మెయిల్స్ ద్వారా అమాయకులను ఆకర్షించినట్టు గుర్తించారు.
ఆ తర్వాత డబ్బులు స్వీకరించి వాటిని డొల్ల కంపెనీల్లోని ఖాతాలకు మళ్లించారు. ఈ డొల్ల కంపెనీలను చైనీయులు ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. వారికి సహకరించిన కేసులో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉందని చెప్పారు.