యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ నడిరోడ్డులో ప్రాంక్ వీడియో చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే, హీరో విశ్వక్ సేన్‌పై అడ్వకేట్ అరుణ్ కుమార్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. పెట్రోల్ డబ్బాతో అభిమానిని సూసైడ్ చేసుకునేలా ప్రాంక్ వీడియో చేసిన విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా ప్రమోషన్స్ పేరుతో రోడ్లపై న్యూసెన్స్, పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తున్నారని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో సినిమా ప్రమోషన్స్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. ఒక హీరో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన యువత పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. యూట్యూబ్‌లో ఉన్న ఇలాంటి వీడియోలు తీసివేయాలన్నారు.
అడ్వకేట్ అరుణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది. ఇక ఈ ఫిర్యాదుపై హీరో విశ్వక్ సేన్ స్పందించారు. కేసులు పెడితే భయపడం.. ఫ్రాంక్ వీడియోలు చేస్తే తప్పేంటి..? అని హీరో విశ్వక్ సేన్ ప్రశ్నించారు. ‘సినిమా ప్రమోషన్‌లో భాగంగా మా మూవీ టీం నా పై ప్రాంక్ ప్లాన్ చేశారు. ఫస్ట్ కంగారు పడ్డాను కానీ.. ప్రాంక్ అని గమనించాను.. నేను కూడా ఎంజాయ్ చేసాను’ అని వెల్లడించారు.
అలాగే, డబ్బాలో ఉన్నది పెట్రోల్ కాదని, వాటర్ అని తెలిపారు. పబ్లిక్‌కి న్యూసెన్స్ క్రియేట్ చేసేలా తాము వ్యవహరించలేదని విశ్వక్ సేన్ స్పష్టం చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సరదాగా తీసుకున్నారన్నారు. ప్రాంక్ వీడియోలు చేస్తూ.. సినిమాలో అవకాశాలు పొందుతున్న వాళ్లు కూడా ఉన్నారని వెల్లడించారు. ప్రాంక్ వీడియోలు చేసే వాళ్ళందరిపై.. కేసులు పెడతా అని లాయర్ అనడం కరెక్ట్ కాదని విశ్వక్ సేన్ అన్నారు.