హైదరాబాద్ లో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతం పుప్పాలగూడ. అలాంటి ఏరియాలో భూమంటే కోట్లు పలుకుతుంది. అంటే ఆటోమేటిక్ గా పెద్దల కన్ను పడకుండా ఉండదు. అయితే.. ఓ న్యాయవాది బిల్డర్ కు చుక్కలు చూపించిన విషయం ఒకటి వెలుగుచూసింది. సర్వే నెంబర్ 342లో తనకు 22 గుంటల భూమి ఉందని.. దానిని డాక్టర్ వై చంద్రశేఖర్ చౌదరి నుంచి గిఫ్ట్ డీడ్ చేసుకున్నామని నమ్మించి ఓ బిల్డర్ ను మోసం చేశారు న్యాయవాది హిమత్ రావు వేణుగోపాల్.
హెచ్ వేణుగోపాల్ గా ఈయన అందరికి సుపరిచితం. సదరు భూమిలో 57 శాతం బిల్డర్ కు, 43 శాతం తనకు చెందేలా గోల్డ్ ఫిష్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.2 కోట్ల పెట్టుబడి పెట్టించారు.
ఆ తర్వాత టైటిల్ పై కంపెనీ ప్రతినిధులకు అనుమానం రావడంతో ఎంక్వైరీ చేశారు. దీంతో ఆ ప్రాపర్టీ గిఫ్ట్ డీడ్ సరైనది కాదని తేలింది. దీనికి తోడుగా నిర్మాణం చేపట్టిన చోట దాడులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు.
పోలీసులు పట్టించుకోకపోవడంతో.. తమని మోసం చేశాడని వేణుగోపాల్ పై 4 వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో నల్లకుంట పోలీసులు న్యాయవాది హెచ్ వేణుగోపాల్ పై ఐపీసీ సెక్షన్స్ 406, 417, 418, 420, 423, 466, 467, 468, 471, 506 లతో పాటు 156(3) సీఆర్పీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.