బెజవాడలోని ఓ కార్పొరేట్ హాస్పటల్ డబ్బుల కోసం కక్కుర్తి పడి తమ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుందని తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారు. నెలరోజులకు పైగా తమ పాపకు ట్రీట్‌మెంట్ ఇస్తూ చనిపోయిన ఐదు గంటల వరకూ తమకు చెప్పకుండా దాచివుంచారని ఆసుపత్రి యాజమాన్యంపై వారు మండిపడుతున్నారు.
విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్.. మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి వారి నిర్లక్ష్యానికి ఒక పసి ప్రాణం బలయ్యినట్టు ఆరోపణ. గత నెల 9వ తేదీన అర్షియా అనే ఓ మూడేళ్ల చిన్నారిని నిమ్ము పట్టిందని చెప్పి విజయవాడ పాత ఆంధ్రా హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. నెల రోజులుగా అక్కడే ఐసీయూలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. హఠాత్తుగా గురువారం ప్రాణాలు విడిచినట్టుగా అక్కడి డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. వాస్తవానికి ఆ చిన్నారి మధ్యాహ్నం 3గంటలకే ప్రాణాలు విడిచింది. ఆ విషయాన్ని రాత్రి 8.30 గంటల వరకూ పాప తల్లితండ్రులకు తెలియనివ్వలేదు. అన్ని గంటల పాటు చిన్నారి మరణించిందనే విషయాన్ని ఎందుకు చెప్పకుండా దాచివుంచారో ఆ తల్లిదండ్రులకి అర్ధంకాక విస్తుబోయారు. అసలు చిన్నారికి అందించిన ట్రీట్‌మెంట్‌పై ఆంధ్రా హాస్పటల్ డాక్టర్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పాప ట్రీట్‌మెంట్ కోసం 8 లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిన తల్లితండ్రులు.. తమ చిట్టితల్లి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని ఆశపడ్డారు. కానీ కూతురి చావు వార్తను కూడా చెప్పకుండా డాక్టర్లు కూడబలుక్కున్నట్టుగా తర్వాత ఎప్పుడో చెప్పడంతో అయోమయంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఆంధ్రా హాస్పటల్ డాక్టర్ల నిర్లక్ష్యంపై పాప కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యానికి కన్న కూతుర్నికోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప మరణానికి హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. తమ కూతురి చావుకి తగిన న్యాయం చేయాలని అర్షియా కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.