గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఇటీవలే విద్వేషపూరిత ప్రసంగం చేశారని ముంబైలో కేసు నమోదు కాగా.. తాజాగా హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. రాజాసింగ్ ప్రసంగాలపై ఆంక్షలు ఉన్నా.. ఆయన మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసులను ఎదుర్కొంటున్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా నగరంలో ఆయన శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ప్రసంగానికి సంబంధించి కేసు నమోదైంది. తన కుమారుడిని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎస్‌ఐ వీరబాబు అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజాసింగ్ పై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రెండు వేర్వేరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు రాజాసింగ్ ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో మునావర్ షో కు సంబంధించి వివాదాస్పద వీడియో విడుదల చేసి జైలు పాలయ్యారు రాజాసింగ్. పోలీసులు పీడీ యాక్ట్ కూడా అమలు చేశారు. అయితే.. కోర్టు పలు కండిషన్స్ తో బెయిల్ ఇచ్చింది. మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని తెలిపింది.
బెయిల్ పై బయటకొచ్చాక.. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజాసింగ్. ఆ సమయంలో విద్వేషపూరిత ప్రసంగం చేశారనే ఆరోపణలపై ఈమధ్యే కేసు నమోదైంది. ఆనాటి ప్రసంగంపై దాదర్ పోలీస్ స్టేషన్ అధికారి కేసు నమోదు చేశారు. ఇవే వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా మరో కేసు రాజాసింగ్ పై ఫైల్ అయింది.