ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి మల్లారెడ్డిపై ఉన్నన్ని కబ్జా ఆరోపణలు ఇంకెవరిపైనా ఉండవేమో. చెరువులే టార్గెట్ గా ఆయన దందా నడుస్తుంటుందని తరచూ ఎవరో ఒకరు ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అయితే.. తాజాగా మంత్రి బామ్మర్ది మద్దుల శ్రీనివాస్ రెడ్డిపై కబ్జా కేసు నమోదైంది. మరి.. ఈ కబ్జా బావ మల్లారెడ్డి కళ్లల్లో ఆనందం కోసమే చేశాడా? అనేది తెలియాల్సి ఉంది.
వివరాల్లోకి వెళ్తే… గుండ్లపోచంపల్లిలోని సర్వే నెంబర్ 5, 6లో వేణునాయుడు, మల్లారెడ్డి అనే సామాన్యులకు కొంత భూమి ఉంది. ఈ భూమిపై శ్రీనివాస్ రెడ్డి కన్నేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలంగా స్థల వివాదం నడుస్తోంది. అయితే.. మూడు రోజుల క్రితం రాత్రి ఒంటిగంట సమయంలో కొందరు వచ్చి స్థలంలో ఉన్న వాటిని పడగొట్టి.. సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిపై బాధితులు పేట్ బషీరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో 15 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారిలో 10 మందిని రిమాండ్ కు తరలించారు. ఇంకో ఐదుగురు పరారీలో ఉన్నారు. వారిలో మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది కూడా ఒకడు.
పరారీలో ఉన్న వ్యక్తుల్లో శ్రీనివాస్ రెడ్డితో పాటు అతని అనుచరులు విద్యాసాగర్ రెడ్డి, మల్లారెడ్డి, నర్సింహారెడ్డి, మరో వ్యక్తి ఉన్నట్లు వివరించారు పోలీసులు. అన్నట్టు.. మంత్రి బామ్మర్ది గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త.