హస్తం పార్టీ చేపట్టిన ఛలో రాజ్ భవన్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సు ధ్వంసం చేసిన ఘటనలో డ్రైవర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, ఫోటోల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
రాహుల్ గాంధీ ఈడీ విచారణను నిరిసిస్తూ ఖైరతాబాద్ జంక్షన్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీకి పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా అక్కడకు తరలివచ్చారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ కూడలి దగ్గర బైక్ కు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. తర్వాత అక్కడే ఉన్న ఆర్టీసీ బస్సు అద్దాలు పగులగొట్టి రచ్చ చేశారు. బస్సు పైకి ఎక్కి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా రేణుకా చౌదరి హల్ చల్ చేయడంపైనా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిరసనలో భాగంగా రేణుక మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆమెను అరెస్ట్ చేసేందుకు చూశారు పోలీసులు. ఆ సమయంలో పంజాగుట్ట పీఎస్ కు చెందిన ఎస్సై ఉపేంద్ర కాలర్ పట్టుకున్నారామె. అంతేకాదు.. నన్నే అరెస్ట్ చేస్తారా అంటూ హంగామా సృష్టించారు.
రేణుకా చౌదరిని చివరకు అరెస్ట్ చేసి గోల్కొండ పీఎస్ కు తరలించారు. అక్కడ కూడా ఆమెను మీడియాతో మాట్లాడేందుకు అనుమతించలేదు పోలీసులు. అయితే.. ఎస్సై కాలర్ పట్టుకున్న కారణంగా ఆమెపై కేసు నమోదైంది. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా విధుల్లో ఉన్న తనపై దురుసుగా ప్రవర్తించారంటూ ఎస్సై చేసిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నారు.