సికింద్రాబాద్ నల్లగుట్టలోని స్థానిక నైట్ వేర్ స్పోర్ట్స్ షాపులో గురువారం చెలరేగిన మంటలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రామ్‌గోపాల్‌పేటలోని డెక్కన్ నైట్‌వేర్ స్పోర్ట్స్ షోరూంలో గురువారం ఉదయం 11 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.
అప్పటి నుండి మంటలను అదుపు చేయడానికి సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. ఘటనా స్థలంలో 30 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ఇంకా సెల్లార్ నుంచి మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. షాపింగ్ మాల్ పక్కన ఉన్న మరో బిల్డింగ్‌కు కూడా మంటలు అంటుకున్నాయి.
ఈ డెక్కన్‌మాల్‌ను కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ణయించారు. భవనానికి సెట్ బ్యాక్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. కాసేపట్లో బిల్డింగ్‌ను అధికారులు పరిశీలించనున్నారు.
ఈ నేపథ్యంలో డెక్కన్‌మాల్ అగ్ని ప్రమాదంపై కేసు నమోదయ్యింది. యజమాని మహ్మద్, రహీంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వసీం, జునైద్, బహీర్ అనే వ్యక్తుల ఆచూకీ తెలియడంలేదని ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. నల్లటి దట్టమైన పొగ, ఎగిసిపడుతున్న మంటలతో ఆ ముగ్గురిని గుర్తించలేకపోతున్నామని పోలీసులు తెలిపారు.