గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. ఈ ఏడాది జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 153 ఏ1(ఏ) కింద కేసు రిజిస్టర్ చేశారు.
ఇదే వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు కూడా గతంలో నోటీసులు ఇచ్చారు. అయితే.. తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చే సమయంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయొద్దని చెప్పింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని చెప్పారు.
గతేడాది అక్టోబర్ లో హైదరాబాద్ లో మునావర్ షో కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానికి అనుమతివ్వడంపై రాజాసింగ్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు ఆందోళనలకు దిగారు. పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఈ క్రమంలోనే పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. తర్వాత నవంబర్ 9న బెయిల్ మంజూరు అయింది.
బెయిల్ సమయంలో కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది. అయినా కూడా జనవరి 29న ముంబైలో జరిగిన కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా కేసు నమోదైంది.