గన్నవరం ఎపిసోడ్ పై పోలీసులు సీరియస్ అయ్యారు. టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు పోలీసులు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు 60 మందికి పైగా తెలుగుదేశం నేతలు, ఇతరులపై కేసులు నమోదయ్యాయి.
గన్నవరం తెలుగుదేశం నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికి పైగా టీడీపీ శ్రేణులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 143,147,341,333,353,307 తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టాభి, మరో 16మంది పై హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. బోడె ప్రసాద్ తో పాటు మరో 11 మంది పై 353,143,147,149 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిని టీడీపీ నేతలు ఖండించారు.సీఎం అండతో రాష్ట్రంలో వైసీపీ ఆకు రౌడీలు చెలరేగిపోతున్నారని, ఈ దాడి జగన్ రౌడీ పాలనకు పరాకాష్ట అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ రౌడీ మూకలు పట్టపగలే కార్యాలయంలోకి చొరబడి కార్యాలయం పై కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందన్నారు. వల్లభనేని వంశీకి బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని.. దమ్ముంటే రావాలంటూ వంశీకి బుద్దా సవాల్ చేశారు.