కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడి చేసిన పలువురు బీజేపీ నేతల పై పలు సెక్షన్ ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 353,188,323,427,341,506,143,147,148 ఇంకా 149 సెక్షన్ల కింద కామారెడ్డిజిల్లా లోని దేవన్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.
బండిసంజయ్ తో పాటు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి,కిష్టా రెడ్డి, ప్రకాశ్,లక్ష్మీపతి,మనోజ్ ఇంకా నేత ప్రదీప్ లతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలపై..ఈ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ గత రెండ్రోజులుగా ఆందోళన తీవ్రతరం చేసిన రైతులకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది.
ఈక్రమంలోనే గురువారం రోజు రైతులు కలెక్టర్ ను కలవడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో అన్నదాతల జేఏసీ శుక్రవారం రోజున కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు రైతులకు మద్దతుగా కామారెడ్డి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ శుక్రవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలెక్టరేట్ ను ముట్టడించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ముందుగానే అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు, పలు గ్రామాల రైతులు… బండి సంజయ్ ఆ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులను తోసేపి కలెక్టరేట్ గేటు వైపు దూసుకెళ్లారు. దీంతో పరిస్థితులు చెయ్యిదాట కుండా పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో కలెక్టరేట్ వద్ద సుమారు రెండు గంటల పాటు హైడ్రామా నెలకొంది. తీవ్ర ఉద్రిక్తత నుడుమ బండి సంజయ్ ను పోలీసు వాహనంలో హైదరాబాద్ కు తరలించారు. ఇక పోలీసు వాహనం ధ్వంసం ఘటనకు సంబంధించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో పాటు బండి సంజయ్ తో పాటు ఇతర నేతలపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ రాత్రే తెలిపారు. దీంతో పలు సెక్షన్ల పై కేసులు నమోదు చేయడం జరిగింది.
అయితే కనీసం రైతుల గోడు వినడానికి కూడా కలెక్టర్ సిద్ధంగా లేకపోవడం అన్యాయమని బీజేపీ నేతలు ఆరోపించారు. వినతి పత్రాన్ని ఇవ్వడానికి గురువారం రోజున వచ్చిన రైతులను కలెక్టరేట్ లోపలికి అనుమతించి ఉంటే.. పరిణామాలు ఇంత వరకు వచ్చి ఉండేవి కావని.. కేసీఆర్ పాలనలో అంతా పోలీసు రాజ్యం నడుస్తుందని బీజేపీ నేతలు మండిపడతున్నారు. అంతా రియల్ ఎస్టేట్ దందా కోసమే ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కుంటుందని బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.