ఏటీఎంలలో 'నో క్యాష్'! జైట్లీ యాక్షన్.. కేటీఆర్ రియాక్షన్

తెలంగాణా, ఏపీ రాష్ట్రాలతో సహా.. కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో నగదు లేక ఏటీఎం లు వెలవెలబోతున్నాయి. నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. వీటి ముందు కస్టమర్లు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో… దీనిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. ఈ పరిస్థితి తాత్కాలికమేనని, సర్క్యులేషన్ కన్నా మించి నగదు నిల్వలున్నాయి గనుక ఒకటి రెండు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని హామీ ఇస్తున్నారు.

కొన్ని చోట్ల కరెన్సీ వినియోగం ఒక్కసారిగా, అనూహ్యంగా పెరిగినందునే ఈ సిచువేషన్ తలెత్తిందన్నారు. కేంద్రం కూడా ఇలాగే భరోసా ఇస్తూ వారం రోజుల్లోగా దేశంలోని అన్ని ఏటీఎం లలో ముఖ్యంగా 500 రూపాయల నోట్లు ఉండేలా చూస్తామని పేర్కొంది. రిజర్వ్ బ్యాంకు కూడా గత గురువారం బ్యాంకర్లతో సమావేశమై,, మిగులు కరెన్సీ ఉన్న బ్యాంకులు..నగదు కొరతను ఎదుర్కొంటున్న బ్యాంకులకు సప్లై చేయాలని ఆదేశించింది.

అటు-తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..ఏటీఎంలలో క్యాష్ క్రంచ్ విషయాన్నితన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ.. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ గా పరిగణించాలని కోరారు. నిజానికి నగదు కొరత ఇప్పుడు వచ్చింది కాదని, గత మూడు నెలలుగా హైదరాబాద్‌లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆయన అన్నారు. కేంద్రం ఇప్పటికైనా ఏటీఎంలలో తగినంత కరెన్సీ ఉండేలా చూడాలని ఆయన అభ్యర్థించారు.