నెల్లూరులో కుళ్లిన కోడి మాంసం.. విశాఖలో ఏకంగా పిల్లి మాంసం.. మనుషులు ఎందుకింత కిరాతకంగా మారిపోతున్నారు.? తినే తిండి దగ్గర కూడా ఎందుకింత దారుణంగా మోసం చేస్తున్నారు? ఇదే తిండి వారికి తిరిగి పెడితే తినగలరా? నాలుగు రూపాయిలు సంపాదించుకోడానికి ఇంతలా దిగజారిపోవాలా? రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం ఒకటి ఉంది కదా.. ఎవరో కంప్లయంట్ చేస్తే తప్ప ఈ కుంభకర్ణ వారసులు కదలరా? రొటీన్ ఇన్‌స్పెక్షన్లు చేయరా?
విశాఖ: సిటీలో ఈస్ట్ నియోజకవర్గం జోడుగుళ్లపాలెంలో భక్తి ముసుగులో పిల్లుల్ని కొందరు వేటాడుతుంటే పోలీసులు పట్టుకున్నారు. వారిని నిలదీస్తే తెలిసిన ఘోరం ఏంటంటే.. విశాఖలో ఈ ముఠా పిల్లి మాంసాన్ని తీసుకెళ్లి హోటళ్లకు విక్రయిస్తోంది. దేవుళ్లు, స్వామిజీ చిత్రాలతో కూడిన ఒక వ్యాన్ తీసుకుని వీళ్లు బయల్దేరతారు. సిటీలో పిల్లులు తిరిగే ప్రాంతాలపై రెక్కీ వేస్తారు. తర్వాత అక్కడ తిష్టవేసి వాటిని పట్టుకుని చంపి ఆ మాంసాన్ని హోటళ్లకు విక్రయిస్తున్నారు. ప్రొటెక్షన్ కేర్ ఆఫ్ అనిమాల్స్ అనే ఎన్‌జీవో సంస్థ సభ్యురాలు శ్రీదేవి ఇచ్చిన సమాచారంతో ఆరుగురు సభ్యుల ముఠాతో వున్న వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యానులో ఒక పిల్లితో పాటు మరో చచ్చిన పిల్లిని పోలీసులు గుర్తించారు. చచ్చిన పిల్లిని పోస్ట్‌మార్టానికి తరలించారు. ఈ ముఠా సభ్యులు గుంటూరులో బెల్లంకొండ మండలం చినరాజుపాలెంకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరు అమ్మడం సరే.. మరి విశాఖలో ఏఏ హోటళ్లలో ఈ పిల్లి మాంసం పెడుతున్నారో కూడా అధికారులు తక్షణం తనిఖీలు చేయాలి.