తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తీరుపై సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ అసహనం వ్యక్తం చేసింది. ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణ జరగ్గా.. సీఎస్ వర్చువల్ గా హాజరయ్యారు. మొహంతిని విధుల్లోకి తీసుకోనందుకు సోమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది క్యాట్.
అభిషేక్ ను రెండు వారాల్లోగా విధుల్లోకి తీసుకోవాలని సోమేష్ ను ఆదేశించింది. ఏపీ కేడర్ కు చెందినప్పటికీ.. ట్రైబ్యునల్ ఆదేశాలతోనే మీరు తెలంగాణలో కొనసాగుతున్నారని వ్యాఖ్యానించింది. అవసరమైతే ఆ ఆదేశాలను పునః సమీక్షిస్తామంటూ సోమేష్ ను హెచ్చరించింది క్యాట్.
అధికారుల విభజనలో భాగంగా అభిషేక్ మొహంతిని కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. అయితే.. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. తర్వాత క్యాట్ ఆదేశాల మేరకు ఆయన్ను ఏపీ రిలీవ్ చేసింది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం తనను విధుల్లోకి తీసుకోవడం లేదని సీఎస్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు మొహంతి.
గతంలో విచారణ జరిపిన క్యాట్ శుక్రవారం హాజరు కావాలని సోమేష్ ను ఆదేశించగా ఆయన మినహాయింపు కోరారు. దానికి నిరాకరించిన ట్రైబ్యునల్ గంటలోగా ఆన్ లైన్ లో హాజరు కావాలని స్పష్టం చేసింది. లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. దీంతో వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు సీఎస్. తాము ఆదేశించినా కూడా మొహంతిని ఎందుకు విధుల్లోకి తీసుకోలేదని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మీరు ఏపీ కేడర్ నుంచి తమ ఆదేశాలతోనే తెలంగాణకు వచ్చారని సీఎస్ కు గుర్తు చేసింది క్యాట్. రెండు వారాల్లోగా అభిషేక్ ను విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.