మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి హెచ్చరిక. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ఆయా వాహనాదరుల డ్రైవింగ్ లైసెన్స్‌ను స్పాట్‌లోనే సస్పెండ్ చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈమేరకు ఆర్‌టీవో అధికారులతో కలిసి ఇందుకు సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ను రూపొందించారు.తెలంగాణలోని జిల్లాల్లో లైసెన్స్ తీసుకున్న వాహనదారుల డాటా బేస్‌ను ట్రాఫిక్ పోలీసు ట్యాబ్‌లకు లింక్ చేయనున్నారు. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లో పట్టుబడితే ఆ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను ట్యాబ్ ద్వారా ఆర్‌టీవో డాటాలోకి పంపిస్తారు. అక్కడ ఆ వివరాల నిర్ధారణ జరిగి..అప్పటికప్పుడే డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయ్యే విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. లైసెన్స్ రద్దు అయినట్టుగా వాహనదారుడికి కూడా ఫోన్ మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది.
లైసెన్స్ రద్దు సమాచారం ఎప్పటికీ పోలీసు, ఆర్‌టీఓ అధికారుల డాటాలో ఉండిపోతుంది. ఒకవేళ వాహనదారుడు మరోసారి అదే లైసెన్స్‌ను చూపించాలనుకుంటే కుదరదు. అలా చేస్తే మరింత కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అతి త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే 2020 సంవత్సరంలో మద్యం సేవించి వాహనాలను నడిపిన 2,402 మంది లైసెన్సులను సస్పెండ్ చేయాలని సైబరాబాద్ పోలీసులు. ఆర్‌టీవో అధికారులకు పంపగా.. అవన్నీ రద్దయ్యాయి.