ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ ఫోకస్ సీఎం కార్యాలయం పై పెట్టడంతో ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సీఎం కార్యాలయంలోని ఓ వ్యక్తిపై సీబీఐ కన్ను పడింది. ఓ పవర్ ఫుల్ వ్యక్తి సహాయకుడికి నోటీసులిచ్చింది. అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి ఎక్కువ కాల్స్ అందుకున్న ఆ సహాయకుడిని విచారణకు రావాలని ఆదేశించింది.
దీంతో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉండే ఓ పవర్ ఫుల్ వ్యక్తికి సహాయకుడిగా వ్యవహరిస్తున్న నవీన్ కు సీబీఐ నోటీసులిచ్చింది. అత్యంత ముఖ్యనేతకు సన్నిహితుడైన మరొకరికి నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈనెల 28 న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని నాలుగన్నర గంటల పాటు విచారించిన సీబీఐ ప్రధానంగా ఆయన కాల్ డేటా పై ఆరా తీసింది. నవీన్ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్ నంబర్ కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసి మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించింది. అప్పుడు సీబీఐ అధికారులు నవీన్ గురించి ఆరా తీశారు.
తాడేపల్లి ప్యాలెస్ లో ఓ పవర్ ఫుల్ వ్యక్తిని..సన్నిహితులు ఎవరైనా సంప్రదించాలన్నా, ఫోన్లో మాట్లాడాలన్నా నవీన్ పేరిట ఉన్న నంబర్ కే కాల్ చేయాల్సి ఉంటుందని.. ఆయన సమాచారాన్ని పవర్ ఫుల్ వ్యక్తికి తెలియజేసి మాట్లాడే ఏర్పాటు చేస్తారని సీబీఐ గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఎక్కువగా ఆ నంబర్ కు కాల్స్ చేసినట్లు అంచనాకు వచ్చింది. దీంతో నవీన్ కు సీబీఐ నోటీసులిచ్చింది.
మరోవైపు అవినాష్ రెడ్డిని మరోసారి విచారణకు పిలుస్తామని సీబీఐ చెప్పిన నేపథ్యంలో అధికారులు పులివెందులకు వచ్చి పలు అంశాలపై ఆరా తీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో రిమాండ్ ఖైదీలను ఫిబ్రవరి 10 న విచారణకు రావాలని అధికారులు నోటీసులిచ్చారు. వీరి విచారణకు ముందు మరింత మందికి నోటీసులిచ్చి దర్యాప్తుకు పిలిచే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు నాయకులు పులివెందుల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది.