ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరి కొద్దిసేపట్లో సీబీఐ ముందు హాజరు కానున్నారు. ఈ కేసులో తనను ప్రశ్నించే అధికారాలు ఈడీ, సీబీఐకి పూర్తిగా ఉన్నాయని, వారి విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని ఆయన చెప్పారు.’ నా ఇంటిలో అధికారులు సోదాలు జరిపారు.. నా బ్యాంక్ లాకర్ లో తనిఖీలు చేశారు.. కానీ వారికి ఏదీ లభ్యం కాలేదు ‘అని ఆయన ఇదివరకే అన్నారు. . ఢిల్లీకి కొత్త లిక్కర్ పాలసీని రూపొందించడంలో సిసోడియా, మరికొందరు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ వికె. సక్సేనా ఆదేశాలతో సీబీఐ దర్యాప్తునకు దిగింది.
ఆప్ ప్రభుత్వం ఈ కొత్త పాలసీని రూపొందించడంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగా ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందన్నది ప్రధాన ఆరోపణ. సిసోడియా నేతృత్వంలోని ఎక్సయిజు శాఖ చేసిన అవినీతిని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వంమళ్ళీ పాత పాలసీవైపు మొగ్గు చూపిందని బీజేపీ ఆరోపించగా.. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా తీసుకున్న నిర్ణయం వెనుక కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ హస్తం ఉందని ఆప్ ప్రత్యారోపణ చేస్తోంది.
నిజానికి సక్సేనాకు, ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య చాలాకాలంగా విభేదాలున్నాయి. తాజాగా ఢిల్లీ మేయర్ ఎన్నికలో లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు ఓటింగ్ హక్కు ఉండదని సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితమే ఇచ్చిన రూలింగ్ తో ఈ విభేదాలు మరింత ఎక్కువయ్యాయి.
లిక్కర్ పాలసీ కేసులో ‘సౌత్ లాబీ’ ప్రభావం ఎక్కువగా ఉందని సీబీఐ పేర్కొంది. మధ్యదళారీలను, ట్రేడర్లు, బ్యూరోక్రాట్లను వినియోగించుకుని ఈ లాబీకి చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అనుచిత ప్రయోజనాలు పొందజూశారని ఈ దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత మాజీ వ్యక్తిగత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేశారు. అలాగే రామచంద్ర పిళ్ళై, సమీర్ మహేంద్రు తదితరులు కొందరిని కూడా అరెస్టు చేశారు. హైదరాబాద్ లో కొంతమంది ప్రముఖులకు చార్టర్డ్ అకౌంటెంట్ గా సేవలు అందిస్తున్న బుచ్చిబాబును ప్రశ్నిస్తున్న సమయంలోనే ఆయన ఇంటి నుంచి హార్డ్ డిస్క్ లతో బాటు కీలక డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.