మాజీ మంత్రి వివేకా హత్య కేసు ఓ కొలిక్కి వస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సునీల్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. విచారణ జరిపి కీలక ఆధారాలు రాబట్టారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పులివెందుల వాగులో తనిఖీలు చేపట్టారు. సునీల్ ను పులివెందులకు తీసుకెళ్లారు అధికారులు.
అతడు ఇచ్చిన సమాచారంతో ఆయుధాల కోసం గాలిస్తున్నారు. సునీల్ సమక్షంలోనే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వివేకా ఇంటికి సమీపంలోని వాగులో ఆయుధాల కోసం వెతుకుతున్నారు. రెండు మున్సిపల్ ట్యాంకర్లతో వాగులో నీటిని తోడేయిస్తున్నారు అధికారులు.
దాదాపు రెండు నెలలుగా ఈ కేసులో దర్యాప్తు సాగిస్తున్న అధికారులు తాజాగా నిందితుల్ని గుర్తించారు. వారిలో ప్రధాన సూత్రధారి సునీల్ యాదవ్ ను అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో వివేకా హత్య కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు.