ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు సంచలనాలు రేపుతోంది. ఈ కేసులో తాజాగా మరొకరిని సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్ కు చెందిన అభిషేక్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ బోయినపల్లిని సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ మేరకు వివరాలను సీబీఐ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే విజయ్ నాయర్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. విజయ్ నాయర్ తర్వాత తాజాగా హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ బోయినపల్లిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది.
ఇదే కేసులో సమీర్ మహేంద్రును కూడా సీబీఐ అరెస్టు చేసింది. ఆయన్ని అధికారులు విచారిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మొత్తం తొమ్మిది కంపెనీల్లో అభిషేక్ రావుకు వాటాలు ఉన్నాయి. అందులో రియల్ ఎస్టేట్ తో పాటు కెమికల్స్, కెమికల్ ఉత్పత్తులు, మైనింగ్ క్వారీయింగ్, తయారీ, కంప్యూటర్ సంబంధిత సేవల కంపెనీల్లో వాటాలు ఉన్నాయి.
లిక్కర్ స్కాంలో ఇటీవల దేశ వ్యాప్తంగా 25 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. అభిషేక్ రావు డైరెక్టర్ గా వున్న రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయం చిరునామాలో అనూస్ బ్యూటీ పార్లర్ ఉన్నట్టు గుర్తించింది. దీనిపై సీబీఐ కన్నేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తి రామచంద్రన్ పిళ్ళైతో కలిసి అభిషేక్ రావు బిజినెస్ చేస్తున్నారు.