వీసా అవినీతి కేసులో కాంగ్రెస్ నేత చిదంబరం కార్తికి అత్యంత సన్నిహితుడు భాస్కర్ రామన్ ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి దేశంలో 10 నగరాల్లో సీబీఐ మంగళవారం సోదాలు నిర్వహించింది.
సోదాలు జరిగిన ఒక రోజు తర్వాత కార్తి సన్నిహితుడు భాస్కర్ రామన్ ను సీబీఐ అధికారులు చెన్నైలో అరెస్టు చేయడం గమనార్హం. అవినీతి ఆరోపణలపై భాస్కర్ రామన్ ను అరెస్టు చేసినట్టు సీబీఐ అధికార వర్గాలు తెలిపాయి.
లోక్ సభ ఎంపీ చిదంబరం కార్తిపై సీబీఐ ఇటీవల మరో కేసు నమోదు చేసింది. పంజాబ్ లో పవర్ కంపెనీ కోసం చైనాకు చెందిన 263 మందికి వీసాల విషయంలో వెసులుబాటు కల్పించారని, అందుకోసం వారి దగ్గర నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారని ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ కేసుకు సంబంధించి నిన్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సహా కార్తి సన్నిహితులు ఇండ్లల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. దేశంలోని 10 నగరాల్లో ఏక కాలంలో సీబీఐ దాడులు చేసింది.