సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆదివారం సీబీఐ విచారణను ఎదుర్కోనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి అధికారులకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటిని క్లియర్ చేసుకునేందుకు కవిత ఇంటికి రానున్నారు. ఉదయం 11 గంటలకు ఈ విచారణ ఉంటుంది.
మొదట.. డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ విచారణకు హాజరు కావాలని కవితను సీబీఐ నోటీసులు పంపింది. అధికారులు కూడా విచారణ కోసం నగరానికి వచ్చారు. కానీ, కొన్ని కారణాలతో ఆరోజున హాజరుకాలేనని ఆమె రిప్లై ఇచ్చింది. 11, 12, 14, 15 తేదీల్లో ఎప్పుడైనా రావొచ్చని సూచిస్తూ సీబీఐని కోరారు కవిత. దీంతో 11న వస్తామని అధికారులు మెయిల్ చేశారు.
ఈ నేపథ్యంలోనే అధికారులు కవితను విచారించనున్నారు. అయితే.. సీబీఐ విచారణపై ఆమెకు పక్కా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రగతి భవన్ లో కేసీఆర్, సీనియర్ న్యాయవాదులు ఆమెకు క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. సీబీఐ అధికారుల తీరు ఎలా ఉంటుంది.. ఎలాంటి ప్రశ్నలు అడిగితే ఏఏ సమాధానాలు చెప్పాలి అనే దానిపైనా వారంతా వివరించినట్లుగా చర్చ సాగుతోంది.
మరోవైపు కవిత సీబీఐ విచారణ నేపథ్యంలో ఆమె ఇంటి దగ్గర కొన్ని బ్యానర్లు వెలిశాయి. వీరుడి కుమార్తె ఎప్పటికీ భయపడదు అంటూ వీటిని ఏర్పాటు చేశారు. అంతేకాదు.. వీ ఆర్ విత్ యూ కవితక్క అంటూ హ్యాష్ ట్యాగ్ ను కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.