సెన్సార్ బోర్డ్ మాజీ ఛైర్మన్, భరతనాట్యం డ్యాన్సర్ లీలా శాంసన్ తో పాటు మరో నలుగురిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2010 లో చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్ ఆడిటోరియం రిన్నోవేషన్ లో రూ.7.02 కోట్ల అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు రావడంతో సీబీఐ దర్యాప్తు చేసింది. కళాక్షేత్ర ఫౌండేషన్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఆడిటోరియం రిన్నోవేషన్ లో అక్రమాలకు పాల్పడింది నిజమేనని సీబీఐ తేల్చింది. ఓపెన్ టెండర్స్ నిబంధనలను పాటించకుండా అత్యంత ఎక్కువ ధరకు కాంట్రాక్ట్ కు ఇచ్చినట్టు గుర్తించింది. కళాక్షేత్ర ఫౌండేషన్ పాలక మండలి అనుమతి లేకుండా ఆడిటోరియం పనులు చేపట్టినట్టు 2015 లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. సాంస్కృతిక శాఖ ఫిర్యాదుతో సీబీఐ 2017 లో లీలా శాంసన్ తో పాటు కళాక్షేత్ర పౌండేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ టీఎస్ మూర్తి, మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్.రామచంద్రన్, ఇంజనీరింగ్ ఆఫీసర్ శ్రీనివాసన్ కార్డ్ ఆర్కిటెక్చర్ ఓనర్ రవి నీలకంఠంపై దర్యాప్తు ప్రారంభించింది.
లీలా శాంసన్ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వద్రాకు డ్యాన్స్ గురువు. యూపీఏ ప్రభుత్వంలో లీలా శాంసన్ కేంద్ర సెన్సార్ బోర్డ్ ఛైర్ పర్సన్, సంగీత నాటక అకాడమీ ఛైర్ పర్సన్ తో పాటు పలు కీలక పదవులు నిర్వహించారు.