మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు కేసును వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. మొదట ఈ కేసు నిందితుడు ఉమాశంకర్ రెడ్డి ఆలస్యంగా రావడంతో కేసును ఆయన వచ్చే వరకు వాయిదా వేశారు.
ఈ కేసులో నిందితులను కడప నుంచి హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. అయితే నిందితుడు ఉమాశంకర్ రెడ్డి వాహనం ట్రాఫిక్‌లో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మిగిలిన నిందితులను కోర్టులో హాజరు పరచలేదు. దీంతో కేసును కోర్టు కొంత సేపు వాయిదా వేసింది.
ఉమాశంకర్‌రెడ్డి వచ్చిన తర్వాత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చేనెల 10కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. నిందితుల్లో శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్ ఇప్పటికే కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
మరో ఇద్దరు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన దస్తగిరి బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్‌లను ఇటీవల సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 10న విచారణకు రావాలంటూ వారిని ఆదేశింది.
కొద్ది రోజుల క్రితం వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేసు బదిలీ నేపథ్యంలో హత్యకు సంబంధించి కడప జిల్లా సెషన్స్ కోర్టులో ఉన్న అన్ని ఫైళ్లు, ఛార్జ్ షీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, దస్త్రాలను 3 బాక్సుల్లో హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకి ఇప్పటికే తీసుకొచ్చారు.