లిక్కర్ స్కాం కేసులో ఈడీ తన పని చేసుకుపోతోంది. శుక్రవారం సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. అందులో పలువురి పేర్లను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో శనివారం సీబీఐ కోర్టు ఈ ఛార్జ్ షీట్ పై విచారణ జరిపింది. దీన్ని పరిగణనలోకి తీసుకునే అంశంపై 20 వతేదీన విచారణ జరుపుతామని తెలిపింది. 13,656 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ.
ఐదుగురు నిందితులు, 7 కంపెనీలపై అభియోగాలు మోపింది. ఇప్పటి వరకూ దాఖలు చేసిన మొత్తం ఛార్జ్ షీట్ లో ఆరుగురు వ్యక్తులు, 11 కంపెనీలు ఉన్నాయి. మొత్తం 17 మంది నిందితుల పేర్లను పేర్కొంది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, బినోయ్ బాబు, అమిత్ అరోరా.. ఈడీ దాఖలు చేసిన సప్లైమెంటరీ ఛార్జ్ షీట్ లో ఉన్నారు.
ఇటీవల సీబీఐ స్పెషల్ కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొందిన ఢిల్లీ ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, వ్యాపారవేత్తలు ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, దినేశ్ అరోరా పేర్లతోపాటు సమీర్ మహేంద్రుకు చెందిన నాలుగు కంపెనీలను కూడా పేర్కొంది. ఈ కేసు వ్యవహారంలో నిందితులపై ప్రత్యేకంగా కొన్ని రిపోర్టులు తయారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇండో స్పిరిట్ వ్యాపారి సమీర్ మహేంద్రును ఏ1గా చేర్చుతూ గతేడాది నవంబర్ 26న 3 వేల పేజీలతో ఈడీ తొలి ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఇందులోనే ఎమ్మెల్సీ కవితకు సౌత్ గ్రూప్, లిక్కర్ స్కామ్ తో ఉన్న సంబంధాలను వెల్లడించింది. ఏ1 గా ఉన్న సమీర్ మహీంద్రుతోపాటు సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన వారిపై ఈడీ డీటైల్డ్ ఎంక్వైరీ చేసి వాటి ఆధారంగానే ఫస్ట్ ఛార్జ్ షీట్ లో మిస్ అయిన పలు అంశాలకు సంబంధించిన వివరాలను సమకూర్చుకున్నట్లు చెబుతున్నారు అధికారులు.
మరోవైపు ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ పైనా విచారణ జరిగింది. దీనిపై విచారణను కూడా 20వ తేదీకి వాయిదా పడింది. ఇటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి బినయ్ బాబు జ్యూడీషీయల్ శనివారంతో ముగుస్తోంది.