అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హజరు కావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఏ1, ఏ2 నిందితులు ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందేనని… మినహాయింపు ఇవ్వటం కుదరదని జగన్ తరఫు లాయర్‌కు కోర్టు స్పష్టం చేసింది.
వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలంటూ సీఎం జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న కోర్టు ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న జగన్, విజయసాయి రెడ్డిలు కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 10న కోర్టుకు హజరై తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. నేరానికి, హోదాకు సంబంధం లేదని న్యాయస్థానం పేర్కొంది.
గతంలోనూ జగన్ వ్యక్తిగత మినహాయింపు కోరుతూ… సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, పైగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నందున ప్రతి శుక్రవారం కోర్టుకు రావాల్సిందేనని సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది.