మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడుగా ముందుకెళ్తోంది. ఓవైపు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచింది. ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతోంది. మరోవైపు కేసులో ఐదుగురు నిందితులకు సమన్లు జారీ అయ్యాయి.
వివేకా హత్య కేసులో విచారణ ప్రారంభించిన సీబీఐ కోర్టు.. కేసులో ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్ ను విచారణకు స్వీకరించింది. ఈక్రమంలోనే నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డికి నోటీసులు పంపంది. ఫిబ్రవరి 10వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించి ఏపీలో న్యాయం జరగదని విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దర్యాప్తు పురోగతిని కూడా నేరుగా పర్యవేక్షించాలని కోరారు. ఆ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఇటీవలే విచారణ జరిపింది. కేసును తెలంగాణకు బదిలీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు తదుపరి విచారణను బదిలీ చేస్తున్నట్టు తెలిపింది.
కేసుకు సంబంధించి అన్ని పత్రాలు, ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ కూడా సీబీఐకి అందాయి. ఈ క్రమంలోనే నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ హత్య కేసు విచారణ 3 ఏళ్లుగా కొనసాగుతోంది. కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరి లను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు అయింది.