– లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ దూకుడు
– తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ప్రకంపనలు
– టెన్షన్ లో బడాబాబులు
– విచారణలో అభిషేక్ రావు గుట్టంతా విప్పుతారా?
– తెరపైకి విశాఖ ప్రముఖుల పేర్లు
– ఢిల్లీలో విచారణకు ఆంధ్రప్రభ ఎండీ గౌతమ్!
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా ఈడీ భయంతో బడాబాబుల బీపీ పెరిగిపోగా.. ఇప్పుడు సీబీఐ స్పీడ్ తో మళ్లీ మీటర్ ముల్లు పైకి వెళ్తోంది. ఎప్పుడొచ్చి విచారణకు ఇన్విటేషన్ కార్డ్ ఇస్తారో అని తెగ భయపడిపోతున్నారు. తాజాగా ఈ స్కాంలో విశాఖకు చెందిన వారి ప్రమేయం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేసులో కొన్ని సంస్థల ప్రమేయంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సంస్థల్లో ఎవరెవరు, ఎంతెంత పెట్టుబడులు పెట్టారన్న విషయాల్ని కూపీ లాగుతున్నారు.
మద్యం వ్యాపారంలో ఆదాయం భారీగానే ఉంటుందన్న ఉద్దేశంతో విశాఖకు చెందిన కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థల యజమానులు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. పెట్టుబడులు పెట్టిన వారికి ఆ డబ్బు ఎలా వచ్చింది, అది వారి డబ్బేనా, ఎవరి తరఫునైనా పెట్టారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వివరాల సేకరణకు త్వరలోనే విశాఖలో ఎంట్రీ ఇస్తారని.. లేదంటే నోటీసులు ఇచ్చి ఢిల్లీకి పిలిపించుకుంటారనే ప్రచారం సాగుతోంది.
ఈ స్కాం కేసులో ఇప్పటికే అరెస్టైన హైదరాబాద్ వ్యాపారి బోయినపల్లి అభిషేక్ రావును అధికారులు విచారిస్తున్నారు. అభిషేక్ రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఎల్ఎల్సీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతన్ని విచారించేందుకు అనుమతివ్వాలని సీబీఐ సోమవారం కోర్టును కోరగా.. మూడు రోజుల పాటు విచారించేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో అతడి నుంచి వివరాలు రాబడుతున్నారు అధికారులు.
అభిషేక్ రావు ఖాతాల్లోకి రూ.3.85 కోట్లు ఎలా వచ్చాయనే విషయమై అధికారులు విచారిస్తున్నారు. అతని వ్యాపార లావాదేవీలు, నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్కాంలో అధికార పార్టీకి చెందిన వారి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ నేతలు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ పై ఆరోపణలు చేశారు. విచారణ సంస్థలు అన్ని విషయాలను బయట పెడతాయని చెబుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రభ ఎండీ గౌతమ్ ను ఢిల్లీకి పిలిపించుకుంది సీబీఐ. పెట్టుబడుల విషయంపై ఆయన నుంచి కూడా వివరాలు రాబడుతోంది.
మరోవైపు ఈ స్కాం విషయమై ఈడీ అధికారులు కూడా హైదరాబాద్ కేంద్రంగా నాలుగు సార్లు సోదాలు నిర్వహించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కీలక సమాచారాన్ని సేకరించారు. హైదరాబాద్ లోని ఆడిటర్ నివాసంలో నిర్వహించిన సోదాల సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రెండు నెలల నుంచి జరిగిన సోదాలు, సేకరించిన ఆధారాల ప్రకారం సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ లు చేస్తున్నారు. ఇప్పటివరకు అరెస్ట్ వారితో ఎవరెవరికి లింకులు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. దీంతో వారిందరికి టెన్షన్ పట్టుకుంది.