అమరావతి రాజధాని ఏర్పాటు సమయంలో జరిగిన భూముల కొనుగోళ్లపై సీబీఐ లేదా లోకాయుక్తతో విచారణ చేయిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
ఇక రాజధాని తరలింపు అంశంపై సీఎం జగన్ మంత్రులకు సుదీర్ఘ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకు తరలించాల్సి వస్తుంది, అమరావతితో వచ్చిన ఇబ్బందులు సహా పలు రాజకీయా అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక రాజధాని విషయంలో మరో హైపవర్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు వారాల్లో నిర్ణయం వచ్చేలా చూడనున్నారు. ఈ కమిటీ ఉద్యోగుల బదలాయింపు, కార్యాలయాల తరలింపుపై నివేదిక ఇవ్వనుంది.
హైపవర్ కమిటీ ఉద్యోగులు, మంత్రులు, ఐఏఎస్‌లతో భేటీ కానుంది. రాజధానిపై ప్రతి మంత్రిని ఓ సూచన చేయాలని జగన్ కోరారని, మంత్రులంతా ఓ కమిటీ వేయాలని సూచించినట్లు తెలిపారు.
ఇక విశాఖను రాజధాని చేయాలి అని చెప్పిన జీఎన్‌రావు కమిటీపై క్యాబినెట్‌లో చర్చ జరిగిందని, అయితే రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక ఇంకా రావాల్సి ఉందని… ఆ నివేదిక జనవరిలో వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాతే రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్ని నాని తెలిపారు.