ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు జగన్ బెయిల్ రద్దు కానుంది, సీబీఐ మరోసారి అరెస్ట్ చేస్తుందన్న వార్తలు గుప్పుమనటంతో… చంద్రబాబుపై ఏసీబీ కేసు అంటూ ఓ వార్త ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఓవైపు జగన్ అక్రమాస్తులపై సీబీఐ విచారణ కొనసాగుతుంటే ఏసీబీతో చంద్రబాబు ఆస్తులపై విచారణ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే, చంద్రబాబుతో పాటు టీడీపీని కట్టడి చేయాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ సర్కార్ ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగించనుంది. అవసరమయితే అరెస్ట్ చేసి జైలుకు పంపేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు ఏపీ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చంద్రబాబు హయంలో జరిగిన అక్రమాలపై గతంలో నమోదైన కేసులలో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు. అయితే, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన సూచన ప్రకారం స్టేలు ఆరు నెలలకు మించకూడదన్న నిబంధనకు ఇప్పుడు ఏపీ సర్కార్ దుమ్ముదులుపుతోంది.
దీంతో చంద్రబాబుపై అక్రమాస్తుల కేసును రెడీ చేసే పనిలో ఏసీబీ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చంద్రబాబు అక్రమాస్తుల అంశంపై ఏసీబీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జగన్ అరెస్ట్ అవుతారంటూ జరిగిన ప్రచారాన్ని టీడీపీ రెండు చేతులా వాడుకుంది. వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయగా… ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అవుతారన్న వార్తను వైసీపీ ఫుల్‌గా వైరల్ చేసే పనిలో పడింది. దీంతో జగన్‌పై సీబీఐ, చంద్రబాబుపై ఏసీబీ బాగానే ఉంది ఏపీ అవినీతి రాజకీయం అంటూ విశ్లేషకులు సెటైర్స్ వేస్తున్నారు.